Talakona, Tirupathi

Give your rating
Average: 4.3 (3 votes)
banner
Profile

Nirmala Tirumani

Loyalty Points : 40

Total Trips: 1 | View All Trips

Post Date : 29 Oct 2023
45 views

తలకోన వెళ్దాం నిర్మలా అని రమేష్ గారు ఫోన్ చేశారు. నేను, అరణ్యకృష్ణ గారు హైదరాబాద్ నుంచి, విజయవాడ వరకు రైల్లో, అక్కడి నుంచి రమేష్ గారి కారులో తలకోన వెళ్లాలన్నది ప్రణాళిక. సికింద్రాబాద్ స్టేషన్ చేరుకునే సరికి, పదకొండున్నరకి రావలసిన మా రైలు రెండు గంటలు ఆలస్యం అని తెలిసింది. ఇక్కడ ఫ్రీ వెయిటింగ్ హాల్ సౌకర్యం లేదు. ఇప్పుడు దాదాపు అన్ని స్టేషన్లలో ఈ సౌకర్యం కనబడటం లేదు. వున్నది పెయిడ్ హాల్ అదీ, కిక్కిరిసి వుంది, లోపల రైలు బండి సమయాన్ని సూచించే బోర్డు లేదు. ప్రతి అరగంటకు బయటికి వెళ్ళి చూసుకొని రావడం పెద్ద సమస్య అయ్యింది. అక్కడ మరో తికమక, బయట డిస్ప్లే లో ఒకలా, యాప్ లో ఒకలా చూపిస్తూ, Display లో ప్లాట్ ఫాం నెంబర్ తప్పు చూపిస్తూ, తికమక పెట్టి, చివరికి తెల్లవారు ఝామున 1:30 కి రైలు బయలుదేరింది. మేము బెజవాడలో రైలు దిగేసరికి తెల్లారిపోయింది. ఎవరో అధికారి వస్తున్నారంటూ స్టేషన్ బయటంతా పోలీసుల హడావుడి. ఇప్పటికే రమేష్ గారు వచ్చి మా కోసం ఎదురు చూస్తున్నారు. రమేష్ గారి డ్రైవర్ ‘ప్రేమ్’  ఎదురు వచ్చి పలకరించాడ. స్టేషన్ బయట కాఫీ తాగి మా ప్రయాణం చిలకలూరి పేట వైపు మొదలు పెట్టాం. కుంభకోణం కాఫీ బాగుంది.

మేము చిలకలూరి పేట వెళ్ళిన దారి పొడుగునా ఆకాశం భలే వుంది. అంచంతా తెల్లని దూది కుచ్చులు కుట్టిన నీలం పట్టు చీరలా కళ్ళని కట్టిపడేసింది, దానికి తోడు జరీ చీర మద్యలో చంకీలు పోసినట్లు మెరిసిపోతున్న పలుచని ఎండ. పైనంతా ఎవరో తీరికగా పెద్ద రథం ముగ్గు వేసినట్లు,  పక్కనే మరో పెద్ద ముగ్గు కోసం చుక్కలు పోసినట్లు, తెల్లని మబ్బులు. చూపు తాకుతున్నంత దూరమంతా వెండి మబ్బులు, పిండి మబ్బులు, దూది మబ్బులు, సబ్బు నురగ మబ్బులు, జున్ను మబ్బులు, పెరుగు మబ్బులు, తెల్ల తెల్లని మబ్బులు  మబ్బులు. చూపులన్నీ మబ్బుల సముద్రంలో మునకలు వేశాయి. బడి విరామంలో గుంపులుగా చేరి కబుర్లు చెప్పుకుంటున్న పిల్లల్లా కనపడుతున్న తాటితోపులు, ఇవి కాక దారికి రెండు వైపులా పత్తి పంటలు, జిన్నింగ్ మిల్లులు, స్పిన్నింగ్ మిల్స్, బోలెడన్ని కోల్డ్ స్టోరేజీలు.

రమేష్ గారు, కృష్ణ గారు రాజకీయాలు, క్రికెట్ గురించి మాట్లాడుకుంటుంటే నాకు ఆఫీసు పని ఎక్కువగా ఉండటంతో కారులో కూర్చుని పని చేసుకుంటూ, మధ్యలో వారి మాటలు వింటూ బయటకు చూస్తూ మౌనంగా కూర్చున్నాను. దారిలో నెల్లూరి నెరజాణ "పెన్న" మా కారుతో సమానంగా కొంత దూరం పరిగెత్తింది. వెనక్కి పరిగెడుతున్న పెన్నా నదిని చూస్తూ పెన్నేటి కథలు తలచుకుంటూ కొద్దిసేపు దిగులు పడ్డాను. మధ్యాహ్నం ఎండ కళ్ళు మిరుమిట్లు కొడుతుండగా మేం నెల్లూరు చేరాం, భోజనాలు అయ్యాక, తిరుగు ప్రయాణం, తిరుపతి రోడ్దులో దారి తప్పి వ్యతిరేక దిశలో వెళ్ళాం.  తర్వాత సరి చూసుకుని ముందుకు పోయాం. ఇక్కడ పాడి ఎక్కువ అనుకుంటా!! దారి పొడుగునా కనపడుతున్న విశాలమైన మైదానాలు, వందల కొద్ది గేదెలు, ఇటుక బట్టీలు చూసుకుంటూ తిరుపతిలో హరినాథ్ రెడ్డి గారింటికి  చేరేసరికి సాయంత్రం అయిదు అయ్యింది. మేము మా గమ్యం చేరే సరికి చీకటి పడటంతో ఉదయాన్నే బయలుదేరి జలపాతం చూడాలని అనుకున్నాం. రాత్రి మా బస ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ వారి పున్నమి అతిథి గృహంలో. ఇక్కడ రెండు అతిథి గృహాలు ఉన్నాయి. ఒకటి మేము దిగిన అటవీశాఖ వారిది, రెండు టీటీడీ ఆధ్వర్యంలో.

అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉన్న అతిథి గృహాలలో, 6 వేరు వేరు గదులు, డార్మెటరీలు, సామూహిక బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ శాకాహార, మాంసాహార భోజన సౌకర్యం వుంది. “సిద్దేశ్వరస్వామి గుడి” గుడి దగ్గర TTD ఆద్వర్యంలో వున్న అతిథి గృహంలో భోజన సౌకర్యం వుండదు, ఇక్కడ మాంసాహారం నిషిద్దం. తలకోన పర్వతాలు తూర్పు కనుమల్లో భాగం. కొండ పైకి వెళ్ళడానికి నాలుగయిదు దారులు వున్నాయట. వెళ్ళే వారి ఓపికను బట్టి నచ్చిన దారిని ఎంచుకోవాలి. కానీ,ఇక్కడి ట్రెక్కింగ్ మార్గంలో ప్రయాణం సాహసంతో కూడిన పని కాబట్టి, తప్పనిసరిగా ఈ ప్రదేశం ఆనుపానులు తెలిసిన సహాయకుడిని వెంట తీసుకుని వెళ్లడం అవసరం. ఈ ట్రెక్కింగ్ తో పాటు, తలకోన, నెలకోన లు, దిగువ ఝరి, ఎగువ ఝరులు, “సిద్దేశ్వరస్వామి గుడి” కలుపుకుంటే ఈ ప్రదేశం మంచి ప్రయాటక ఎంపిక అవుతుంది.

తలకోన అడవి గురించి మొదటిసారి 1985 లో అన్వేషణ సినిమా చూస్తున్నప్పుడు విన్నాను. దాదాపు నలభై యేళ్ళు ఎదురు చూసి ఇంత దూరం వచ్చాక చీకటి వల్ల అడవి లోకి వెళ్ళ లేక పోవడం వల్లేమో, రాత్రంతా “ఏకాంత వేళ” పరుగులే నా కలల నిండా. ఇంకా తెల్లారుతూ ఉండగానే అడవిలోకి నాలుగు అడుగులు వేయడానికి బయలుదేరాం ముగ్గురం. వాళ్ళు ఇద్దరూ మార్నింగ్ వాక్ కు వెళుతున్నట్లు గబగబ అడుగులు వేస్తున్నారు. నేను మాత్రం బద్దకంగా చుట్టూ వినపడుతున్న అడవి పిట్టల కీరవాణి కూనిరాగాలలో మునిగిపోయి నెమ్మదిగా అడుగులు వేస్తూ సోమరి నడక మొదలు పెట్టాను. ఖాళీగా వున్న ఆ అడవి దారిలో నా అడుగుల చప్పుడు నాకే ప్రతిధ్వనిస్తుంటే  'అలికిడైతే చాలు ఆశతో నా కనులు" అంటూ నా అడుగుల చప్పుడు మైకంలో నేనే మునిగిపోయాను.

సన్నగా పట్టు దారాల్లా మెరిసిపోతున్న సూర్య కిరణాలు అడ్డంగా నిలబడిన చెట్లను ఒడుపుగా తప్పించుకుని నన్ను హత్తుకోవాలని. ప్రయత్నం చేస్తూ వున్నాయి. బంగారు రజను వొలకబోసినట్లు దారంతా పరుచుకున్న పలుచని లేత పసుపు వెలుతురు దారిలో సాగుతున్న నా నడక, నడుస్తున్నట్లు కాకుండా నాకాళ్ళకు రెక్కలు మొలిచి గాలిలో తేలిపోతున్నట్టు ఉంది. అడవి పూల వాసన, పసరు వాసన కలిసి పురి పెట్టిన దారంలా నా చుట్టూ గాలిలో గింగిరాలు తిరుగుతుంది. రోడ్డుకి రెండువైపులా దట్టంగా ఆకాశాన్నంటుతున్న మహా వృక్షాలు, చెట్టు మొదళ్ళలో కాళ్ళను పెనవేసుకున్న ఇత్తడి కడియాల్లా రింగు రింగుల్లా పెరిగిన వేర్లు, పాదాలకు దట్టంగా పారాణి పూసినట్లున్న చెట్ల చుట్టూ పోగుపడిన మాగిపోయిన పండుటాకులు.  నాలుగు నెలల క్రితం చూసిన మంచిర్యాల అడవి యవ్వనంతో ఎగసి పడుతున్న అమ్మాయిలా అనిపిస్తే, ఈ తలకోన జ్ఞానంతో పండిన వృద్దురాలి లా వుంది, మౌనంగా జ్ఞాపకాలు తలపోసుకుంటూ పరధ్యానంగా కూర్చున్న అమ్మలా వుంది. 

సన్నగా పట్టు దారాల్లా మెరిసిపోతున్న సూర్య కిరణాలు అడ్డంగా నిలబడిన చెట్లను ఒడుపుగా తప్పించుకుని నన్ను హత్తుకోవాలని. ప్రయత్నం చేస్తూ వున్నాయి. బంగారు రజను వొలకబోసినట్లు దారంతా పరుచుకున్న పలుచని లేత పసుపు వెలుతురు దారిలో సాగుతున్న నా నడక, నడుస్తున్నట్లు కాకుండా నాకాళ్ళకు రెక్కలు మొలిచి గాలిలో తేలిపోతున్నట్టు ఉంది. అడవి పూల వాసన, పసరు వాసన కలిసి పురి పెట్టిన దారంలా నా చుట్టూ గాలిలో గింగిరాలు తిరుగుతుంది. రోడ్డుకి రెండువైపులా దట్టంగా ఆకాశాన్నంటుతున్న మహా వృక్షాలు, చెట్టు మొదళ్ళలో కాళ్ళను పెనవేసుకున్న ఇత్తడి కడియాల్లా రింగు రింగుల్లా పెరిగిన వేర్లు, పాదాలకు దట్టంగా పారాణి పూసినట్లున్న చెట్ల చుట్టూ పోగుపడిన మాగిపోయిన పండుటాకులు.  నాలుగు నెలల క్రితం చూసిన మంచిర్యాల అడవి యవ్వనంతో ఎగసి పడుతున్న అమ్మాయిలా అనిపిస్తే, ఈ తలకోన జ్ఞానంతో పండిన వృద్దురాలి లా వుంది, మౌనంగా జ్ఞాపకాలు తలపోసుకుంటూ పరధ్యానంగా కూర్చున్న అమ్మలా వుంది. 

తలకోన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కెల్లా ఎత్తైన జలపాతం. ఇది పెన్నా నదీతీరంలో ఉంది. దారిలో వదిలేసి వచ్చిన పెన్న ని మళ్ళీ ఇక్కడ జలపాతంలో కలుసుకున్నాం. బాగా ఎత్తు నుండి పడటం వల్ల ధార సన్నగా పడుతున్నట్లు అనిపిస్తుంది. అక్టోబర్ నుండి జనవరి వరకు ఇక్కడికి రావడానికి మంచి సమయం, మేము కొద్దిగా ముందు రావడం వల్ల జలపాతంలో మరీ ఎక్కువగా నీళ్ళు లేవు. ఈ జలపాతం ఉన్న కొండపైన అక్కడక్కడ గుహలు ఉన్నాయని మా కుర్రాళ్ళు చెప్పారు. మా గైడ్ పిల్లాడు నన్ను పైవరకు తీసుకుపోతామని నాకు మాట ఇచ్చాడు కానీ, అక్కడ వున్న భద్రతా సిబ్బంది అనుమతి లేదని దానిని పడనీయలేదు. మిగతా ఇద్దరు కొద్దిగా క్రిందకు దిగి ఫోటోలు తీసుకోవటంలో మునిగిపోతే, నేను పక్కన కూర్చుని జలపాతం కింద స్నానం చేస్తున్న కుటుంబాలని గమనిస్తూ కూర్చున్నాను. జలపాతం కిందంతా నాచు పట్టి వుంది. చూస్తుండగానే స్నానం చేస్తున్న వారిలో ఒక పన్నెండేళ్ల పాప హటాత్తుగా జారిపడి పోయింది. దెబ్బ బాగా తగిలిందేమో పొగిలి పొగిలి ఏడవటం మొదలు పెట్టింది. వాళ్ళ నాన్న వెంటనే అమ్మాయిని పొదివి పట్టుకుని బయటకు నడిపించుకుని తీసుకుని రావడం మొదలు పెట్టాడు. నేను ఎదురు వెళ్ళి దెబ్బ బాగా తగిలిందా, నడవడానికి సాయం పట్టనా అని అడిగాను. వాళ్ళు తమిళ్ అనగానే, ఇంగ్లీషులో మళ్ళీ అడిగాను. దానికి ఆ నాన్న పరవాలేదు నేను నడిపిస్తాను అని చెప్పారు. అమ్మాయి, నొప్పికి, అవమాన భారానికి ఆగి ఆగి ఏడుస్తూనే ఉంది. పాపం చిన్న పిల్ల అందరి ఎదురుగా పడిపోవటం తట్టుకోలేక పోయింది. ఏడ్చి, ఏడ్చి కళ్ళు వాచిపోయాయి, ముఖం అంతా ఎర్రగా కందిపోయింది. 

ఈలోగా ఫొటోలు దిగడం పూర్తయిన ఇద్దరూ తిరిగి వచ్చారు, ముగ్గురం కలిసి జలపాతం క్రిందికి వెళ్ళి తడిచి వచ్చాం. తలకోన అడవి లో ఔషద మొక్కలు ఎక్కువ, దానివల్ల ఈ నీటికి జబ్బులను నయం చేసే గుణం వుంది అని స్థానికుల నమ్మకం. మేము తాగి చూసిన నీరు మాత్రం మంత్ర జలంలా తియ్యగా వుంది. అక్కడ దాదాపు ఒక గంటన్నర గడిపాక, తిరిగి వెళ్తున్న దారిలో కనపడిన 'giant squirrel' ఫోటోలు తీసుకున్నాం, చెవి ఒగ్గి కూని రాగాలు తీస్తున్న పిట్టల పాటలు విన్నాం. తరువాత దగ్గరలో వున్న నెలకోన కి తీసుకుని వెళ్లారు మా కూడా వచ్చిన కుర్రాళ్ళు. ఈ దారిలో అడుగులు వేయడానికి మా కుర్రాళ్ళు తెచ్చిన కర్రలు బాగా ఉపయోగ పడ్డాయి. నెలకోన దట్టమైన కొండల మధ్య ఉంది. లోనికి పోయే బాటంతా కొండరాళ్ల దారి, బహుశా నీటి ప్రవాహ మార్గం అనుకుంటా. బాగా వర్షాలు పడినప్పుడు మేము నడుస్తున్న దారంతా కొండ వాగు ప్రవాహంలో మూసుకుపోతుంది అన్నారు. మేం నడిచి వెళ్ళిన దారంతా ఒకవైపు విశాలంగా పరుచుకున్న కొండ రాతి గోడ మరో వైపు దట్టమైన అడవి. 

రెండు చేతులు చాచినా పట్టని బలమైన కాండాలతో అడ్డు ఆపు లేకుండా స్వేచ్ఛగా విస్తరించిన విశాలమైన అడవి చెట్లతో, కళ్ళార్పనీయని అందం ఈ అడవి సొంతం. నల్లని త్రాచుపాములా, నాచు పట్టి వున్న చెట్టు కాండాల సిగలో తురుముకున్న మల్లె మాలల్లా మొలచిన పుట్టగొడుగుల వరుసలు. దారిలో తీరికగా కునుకు తీస్తున్నపెద్ద కొండచిలువలా పరచుకున్న అడవి తీగలు. దారంతా చూడడానికి కఠినంగా ఉంది కానీ అడుగులు వేస్తుంటే చిన్న పిల్లల ఆటలా అనిపించింది. దారంతా రాలి పడివున్న ఇండుగ పిక్కలు నేను ఆపేక్షగా ఏరుకుంటుంటే అందరూ తలో చేయి వేసి సాయం చేశారు. దారిలో మా కుర్రాళ్ళు ఇక్కడ షూటింగ్ జరిగిన సినిమా కథలు చెప్పారు, పుష్ప 2 కూడా అన్నది కొసమెరుపు.

దాదాపు ఒక నలభై నిమిషాలు నడిచి ఎదురుగా కనబడుతున్న అద్భుతాన్ని చూసి కన్నార్పడం మరచిపోయి నిలబడి పోయాం అందరం. ప్రాణంతో నడయాడుతున్న కొండ దేవతకు ప్రకృతి తొలచి పెట్టిన గుండెలా ఎదురుగా రెండు కొండల నడుమ హృదయాకారంలో కనపడుతున్న పెద్ద కొండ రాయి, వెనుక నుంచి వెలుతురు సోన. హటాత్తుగా మా కళ్ళముందు ప్రత్యక్షమైన కొండ గుహలో చంద్ర వంకలా పై నుండి జాలువారుతున్న ఆ వెండి వెన్నెల వెలుగును చీల్చుకుని, హృదయ స్పందనలా సన్నని సవ్వడి చేస్తూ కొండ నుంచి లోయలోకి జారుతున్న జలపాతం. ఇన్ని వందల మైళ్ళ ప్రయాణం చేసి ఇంత దూరం వచ్చినది ఈ అద్భుతాన్ని చూడడానికి కదా అనిపించింది. ఇక్కడ ప్రవాహ ఉపరితలంలో నీటి మూలాన్ని, అలాగే అంతర్వాహినిలా అది భూగర్భంలో ఎలా మాయం అవుతుందో గుర్తించడం కూడా కష్టం. 

నీళ్ళల్లో దిగుదామని గబగబా అడుగులు వేసిన నాకు పక్కనే నిర్జీవంగా కనపడిన "మూషిక జింక" చూసి ప్రాణం ఉసూరుమంది. బహుశా పై నుంచి జారిపడి ఉంటుంది. దాని గురించి కొంత సేపు జాలి పడి. జలపాతం కింద మడుగులో ఉన్న నీరు చాలా తేటగా, చల్లగా వుంది నాలుగడుగులు లోపలికి నడవగానే జివ్వు మంటూ ఒంటికి తగిలిన చల్లటి నీళ్ళు, కొలను అంతా హడావిడిగా ఈతలు కొడుతూ ఎవరైనా లోపల అడుగు పెట్టగానే, "దాడి చేయండి రా ఆ ఆ" అంటూ పాదాలను బుజ్జి బుజ్జి నోళ్ళతో కొరికేస్తూ పెడిక్యూర్ చేస్తున్న వందల కొద్దీ చేప పిల్లలు. చిన్నతనంలో వదిలేసి వచ్చిన ‘కితకితలాటని’ గుర్తు చేశాయి. రెండు క్షణాలు నీళ్ళలో నిలబడటం, పకపక లాడుతూ ఒక కాలు పైకి తీయడం, మరో రెండు క్షణాల్లో మళ్ళీ రెండో కాలు. కాళ్ళతోనే మమ్మల్ని మ్యూజికల్ చెయిర్ ఆట ఆడించే శాయి ఈ బుల్లి రిఫరీలు. ఒకరి తరువాత ఒకరు మళ్ళీ మళ్ళీ నీళ్లలో దిగి ఒంటి కాలు పైకి మారి ‘తకధిమి థిల్లానా’ అని అటు ఇటూ వూగి బయటకు పరుగులు పెట్టడం, నవ్వటం, మళ్ళీ లోపలికి వెళ్ళటం కాళ్ళు పెట్టడం. మా ప్రయాణ బడలిక మొత్తం పోయింది. ఈ అడవిలో మద్ది, చందనం, ఎర్ర చందనం వృక్షాలు అధికంగా ఉన్నాయని చదవటం వల్ల, తిరుగు ప్రయాణంలో ఎర్ర చందనం చెట్లు చూపించమని అడిగాను. మా వాళ్ళు దారిలో ఆపి వాటిని చూపించి, ఎలా గుర్తు పట్టాలో చెప్పారు.